కీసర, సెప్టెంబర్ 17, (తెలంగాణ దిశ) : కీసర పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు కేసులో ఫిర్యాదుదారు, అతని స్నేహితుడిని వేధించకుండా ఉండేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు పోలీసు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెప్టెంబర్ 16న రాత్రి 11.25 గంటల సమయంలో ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు ఈ దాడి నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అర్కపల్లి అంజనేయులు (ఏఓ-1) సూచనల మేరకు ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి (ఏఓ-2) లంచం స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. ఏఓ-2 వద్ద నుంచి రూ.5 లక్షల లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ అధికారిక విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి న్యాయ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు దారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా ఏసీబీ వెల్లడించలేదు.




