వరుసగా ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 21, (తెలంగాణ దిశ) : దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనుండటంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఏర్పడనుంది. ఐదు రోజుల పనిదినాల అమలు సహా ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్, బ్యాంకు శాఖల్లో నిర్వహించే ఇతర ప్రత్యక్ష సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే అవసరమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని, నగదు అవసరాలు ఉంటే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించినట్లు సమాచారం. అయితే ఏటీఎంలు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉన్న ఖాతాదారులు సెప్టెంబర్ 26కు ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోవడం ద్వారా ఇబ్బందులను నివారించుకోవచ్చు.




