ఉత్సవ సమితి బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (తెలంగాణ దిశ) : గణేష్ ఉత్సవ సమితి బాధ్యతలను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అప్పగించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ తాడూరి గగన్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి 2026 కన్వీనర్‌గా తనను అఖిలపక్ష నాయకులు, ఫౌండర్లు, సీనియర్ నాయకుల నిర్ణయం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్‌ను అఖిలపక్ష నాయకులు, ఫౌండర్ల సమ్మతితో ఎన్నుకునే ఆనవాయితీ ఉందని గగన్ కుమార్ పేర్కొన్నారు. అయితే గత రెండేళ్లుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ విషయంపై గతంలో కూడా అఖిలపక్ష నాయకులు, ఫౌండర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనను డివిజన్ కన్వీనర్‌గా ఎన్నుకున్నారని చెప్పారు. అయితే ఈ నిర్ణయం కొందరికి నచ్చక తనను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సెప్టెంబర్ 19న కాప్రా చెరువు వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక వద్ద డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన రిజిస్టర్ బ్యానర్‌ను ఏర్పాటు చేయగా, కొందరు వ్యక్తులు దానిని తొలగించారని గగన్ కుమార్ తెలిపారు. తమకు కేటాయించిన స్వల్ప స్థలంలో బ్యానర్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై డయల్ 112కు సమాచారం అందించగా పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అనంతరం సెప్టెంబర్ 21న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భగవంతుని సేవలో అందరూ సమానమేనని చెప్పే గణేష్ ఉత్సవాల్లో ఒక దళితుడికి కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం తప్పా అని గగన్ కుమార్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తున్నామని చెప్పే వారు సామాజిక సమానత్వాన్ని కూడా ఆచరణలో చూపాలని కోరారు. ప్రభుత్వ నిధులతో గణేష్ ఉత్సవాల కోసం మౌలిక వసతులు, వేదికలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒకే ఉత్సవ సమితికి సంబంధించిన బ్యానర్లకు మాత్రమే అవకాశం కల్పించి, ఇతర సమితుల బ్యానర్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై, బ్యానర్ తొలగింపునకు సహకరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.




