కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06, (తెలంగాణ దిశ) : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఇచ్చిన “చలో అసెంబ్లీ” పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజామున 4.50 నిమిషాలకు నిజాంపేట పూజిత ఎన్ క్లేవ్ లోని కొన్ని మాధవి నివాసానికి పోలీసులు చేరుకొని ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కొల్లి మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి వెళుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.




