దారి మూసి వేసి ఇటుకలు, సిమెంట్‌తో దిమ్మెల ఏర్పాటు
ఉత్సవాలకు పది రోజుల ముందే రహదారి మూసివేత
కింది కాలనీల వాసులకు తప్పని ఇబ్బందులు
కుషాయిగూడ, సెప్టెంబర్ 06, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీ, ఇందిరానగర్ రోడ్ నంబర్ 7లో గణేష్ ఉత్సవ షెడ్డు నిర్మాణం కోసం రహదారిని పూర్తిగా మూసి వేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఇటుకలు, సిమెంట్‌తో దిమ్మెలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ రహదారి అవతలి వైపు ఉన్న చాలా కాలనీలకు ప్రధాన రాకపోకల మార్గంగా ఉంది. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేయడంతోపాటు, రహదారి ఆక్రమణల కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా గణేష్ షెడ్డు కోసం రహదారినే పూర్తిగా మూసి వేయడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మూసివేత కారణంగా అవతల ఉన్న ద్వారకాపురి కాలనీ, సోనియా గాంధీ నగర్, శుభోదయం కాలనీ, మధురానగర్, చక్రిపురం, మారుతినగర్ తదితర కాలనీలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారి నుంచి చక్రిపురం, మారుతినగర్ తదితర కాలనీలకు వెళ్లే వారు ఈ మార్గాన్నే ఉపయోగిస్తుంటారు. అటు డిమార్ట్ రోడ్డులో నిర్మాణ పనులతో ప్రయాణం సాగించలేని పరిస్థితి, ఇటు నాగార్జున నగర్ కాలనీ రోడ్ నంబర్ 1 నుంచి లక్ష్మీనరసింహ కాలనీ మీదుగా రావాలంటే నాగార్జున నగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో నాగార్జున నగర్ కాలనీ రోడ్ నంబర్ 3, ఇందిరానగర్ రోడ్ నంబర్ 7 మీదుగా దిగువ కాలనీవాసులు ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ఎంతో మంది ప్రయాణించే ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడం సబబు కాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఎవరు వ్యతిరేకం కాదని, ప్రజల రాకపోకలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా షెడ్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పరిస్థితిని పరిశీలించి, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని ద్వారకాపురి కాలనీ, సోనియా గాంధీ నగర్, మధురానగర్ తదితర కాలనీల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రోడ్డు ఆక్రమణకు కూడా గురైందని, రోడ్డును ఇష్టానుసారంగా ఆక్రమించి వాహనాలు నిలుపు తుండడంతో రాత్రి వేళల్లో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లే అవకాశం లేకుండా పరిస్థితి నెలకొని ఉందని చెబుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




