నీరు గారి పోతున్న దమ్మాయిగూడ ‘నాసిన్ చెరువు’
చెత్తా చెదారంతో దుర్భరంగా మారుతున్న చెరువు..
అక్రమ కబ్జాలతో మరింత ప్రమాదంలో చెరువు ఉనికి
దమ్మాయిగూడ, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : ఒకప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టి పరిసర ప్రాంతాల భూగర్భ జలాలను పెంపొందించిన దమ్మాయిగూడలోని నాసిన్ చెరువు నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతుంది. చెరువుతో పాటు పరిసరాలు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, వినియోగించిన వస్తువులతో నిండిపోవడంతో జలాశయం క్రమంగా చెత్త కుండీగా మారుతున్న దృశ్యం కనిపిస్తోంది. చెరువు చుట్టు పక్కల నివసించే కొందరు ప్రజలు ఇళ్లలోని చెత్తను నేరుగా చెరువు పరిసరాల్లో పడేస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతుంది. చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, వ్యర్థ వస్తువులు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో చెరువు సహజ వాతావరణం దెబ్బ తింటుంది. వర్షాకాలంలో ఈ వ్యర్థాలు నీటిలో కలిసే ప్రమాదం ఉండటంతో నీటి నాణ్యతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. నాసిన్ చెరువు దుస్థితికి కేవలం చెత్త సమస్యే కాకుండా నీటి ప్రవాహ మార్గాల పరిస్థితి కూడా కారణమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులోకి సహజంగా చేరాల్సిన వర్షపు నీటికి ఆటంకాలు ఏర్పడితే భవిష్యత్‌లో చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చెరువు పరిధిలోని భూములపై కొందరు కబ్జాదారుల కన్ను పడిందని, చెరువులోకి నీరు రాకుండా చేసి జలాశయాన్ని క్రమంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు భూములు, ఎఫ్‌టీఎల్ పరిధి, నీటి ప్రవాహ మార్గాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. నాసిన్ చెరువును కేవలం నీటి నిల్వ ప్రాంతంగా కాకుండా స్థానిక పర్యావరణ వ్యవస్థలో కీలకమైన జలవనరుగా గుర్తించి సంరక్షించాల్సిన అవసరం ఉంది. చెరువు పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలి. చెరువు నీటి ప్రవాహ మార్గాలను గుర్తించి ఆక్రమణలు ఉంటే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ హద్దులను స్పష్టంగా గుర్తించి, భవిష్యత్‌లో ఎలాంటి నిర్మాణాలు, ఆక్రమణలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే చెత్తను తొలగించకపోతే.. భవిష్యత్తులో చెరువునే వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. దమ్మాయిగూడకు కీలకమైన నాసిన్ చెరువును కాపాడేందుకు మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నాసిన్ చెరువు పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకుని, చెత్త తొలగింపు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ, ఎఫ్‌టీఎల్–బఫర్‌జోన్ పరిరక్షణ, అక్రమ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ప్రస్తుతం కనిపిస్తున్న నీటి మడుగులు కూడా రానున్న రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




