విశేష పూజలు, గణపతి హోమం.. భక్తులకు అన్న ప్రసాద వితరణ
కీసర, సెప్టెంబర్ 14, (తెలంగాణ దిశ) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరలోని శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వర స్వామివారికి ఉదయాన్నే పంచామృత, నవకలశాభిషేకాలు నిర్వహించి, గణపతి హోమం చేపట్టారు. అనంతరం వివిధ రకాల పత్రి, పుష్పాలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వినాయకుడికి ప్రీతికరమైన తుమ్మికూర, ఉండ్రాళ్ల పాయసం, పులిహోర, దద్దోజనం, బెల్లం పొంగలి, సున్నుండలు తదితర ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కీసర మండల మాజీ ఎంపీపీ మల్లారపు ఇందిర, ఆలయ ధర్మకర్త శ్రీహరితో పాటు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.




