ముగ్గురికి తీవ్ర గాయాలు.. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీ
కుషాయిగూడ, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) :
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్ నార్త్ కమల్‌నగర్‌కు చెందిన విక్రమ్ కుమార్ (25) మౌలాలి ఎస్పీ నగర్‌లోని త్రిశూల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా అక్కడే పని చేస్తున్న ఆయన, సోమవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని తన ఏడుగురు మిత్రులతో కలిసి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో న్యూ చైతన్య కాలేజీ సమీపంలోని దేవి మొబైల్ షాప్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. కారు నంబర్ ఏపీ 10 ఎయు 1232గా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదంలో అజయ్ కుమార్, బిపిన్ కుమార్ యాదవ్, రాకేష్ యాదవ్‌లకు తీవ్ర రక్త గాయాలు కాగా, ముఖేష్ కుమార్ యాదవ్, రంజన్ యాదవ్, బివాష్ యాదవ్, కపెందర్ యాదవ్‌లకు గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. వెంటనే విక్రమ్ కుమార్ తన గదిలోని సహచరులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈసీఐఎల్‌లోని సూర్య ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




