పని చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన యాకూబ్
కుషాయిగూడ, సెప్టెంబర్ 12, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనారోగ్య కారణాలతో ఓ పెయింటర్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్.పీ. కాలనీ, తిరుమలనగర్ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన మల్లెపాక యాకూబ్ (41) పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 14 ఏళ్ల క్రితం అర్చనను వివాహం చేసుకున్న యాకూబ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. యాకూబ్‌కు గతంలో మద్యం సేవించే అలవాటు ఉండగా, గత రెండేళ్లుగా ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మద్యం సేవించడం తగ్గించినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో యాకూబ్ ఇంటి వద్ద ఉండగా, అనంతరం పెయింటింగ్ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో తన చిన్న కుమారుడితో కలిసి పని చేస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో విషయం భార్య అర్చనకు తెలియడంతో ఆమె వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే యాకూబ్‌లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఫిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయి యాకూబ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్యకు ఎలాంటి అనుమానం లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




